వినాయక పత్రిలోని ఔషధ గుణాలు(Medicinal properties of Vinayaka Patri)
ప్రతి సంవత్సరం మన భారతదేశంలో గణేష్ ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా..ఈ విఘ్నేశ్వరుడికి 21 పత్రాలతో స్వామి వారిని అర్చిస్తూ..పూజ చేస్తుంటాము. ఈ పత్రిలు గణనాధుడికి ఎంతో ప్రీతికరమైనవిగా పురాణాలు చెపుతున్నాయి. అయితే, వినాయక చవితి పూజలో ఎన్నో వైద్య రహస్యాలు దాగివున్నాయి. అందుకే, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా..ఈ వినాయక చవితి పూజ అనేది, గణేశుడి పూజ కోసం ఉపయోగించే “పత్రి” సేకరణ వలన, సమాజానికి, పిల్లలకు..ఎంతో “విజ్ఞానం, వినోదం, పర్యావరణం పట్ల స్నేహభావం” కలుగుతాయి. మరియు సమాజంలో కులం, మతం అనే తేడా లేకుండా ఆ భగవంతుడి ముందు అందరు ఒక్కటే అనే భావం కలిగించడమే అసలైన అర్ధం..దీని వల్ల అందరికి ఎన్నో లాభాలు ఏర్పడుతాయి అని కూడా చెప్పొచ్చు.
కొత్త మట్టితో మాత్రమే వినాయక రూపం కలిగిన విగ్రహమును చేసి, అక్కడ ఈ 21 పత్రిలను పెట్టి..నవరాత్రులు పూజ చేయాలి. తర్వాత, గణపతిని జలంలో నిమజ్జనం చేయాలి. గణపతిని పూజించే 21 రకాల ఆకులు అనేవి “సాధారణమైన ఆకులు కావు”. ఇవన్నీ, గణపతికి ఇష్టమైన, శక్తివంతమైన ఔషధములు. ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ పత్రాలను గణపతి దగ్గర నవరాత్రులు కూడా ఇంట్లో పెట్టి, పూజ చేస్తుండడం వల్ల పత్రాల నుండి అలాగే, కొత్త మట్టితో తయారు చేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి, ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు అందిస్తుంది. వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు “ఆక్సిజన్” ను విడుదల చేస్తాయి. అంతేకాక, వాటి మీదుగా వీచే గాలి..మనలోని అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందంట.
తర్వాత ఘట్టం..నవరాత్రులు పూజలందుకున్న గణనాధుడి ప్రతిమతో పాటు ఆకులను నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల..ఈ పత్రిలో ఉండే ఔషధ గుణాల ఆల్కలాయిడ్స్ ని ఆ నీటిలోకి వదిలేస్తాయంట. అవి బాక్టీరియా ను నిర్ములించి, జలంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతూ..ఈ విధంగా జలాన్ని శుభ్రం చేస్తాయట. ఇదే, వినాయక నిమజ్జనం వెనుక ఉండే “పర్యావరణ పరిరక్షణ” రహస్యం అని చెప్పవచ్చు.
అందుకే, గణేశుడి పూజ కోసం ఉపయోగించే 21 రకాల ఆకులు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి? అనేది తెలుసుకుందాము..
- మాచీపత్రం(మాచిపత్రి) : ఇది చేమంతి జాతికి చెందిన, సువాసనను వెదజల్లే మొక్క. ఈ పత్రాలున్న పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సూక్ష్మ క్రిములు దరి చేరవు. ఇది దద్దుర్లు, తలనొప్పి, వాతనొప్పులు, కళ్ళు, చర్మసంబంధమైన వ్యాధులు నివారించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
- బృహతీ పత్రం(వాకుడాకు) : దీనిని “ములక” అని కూడా పిలుస్తారు. బాలింతలకు ఈ చెట్టు ఒక వరం. అనేక దివ్యఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేస్తుంది. మరియు వీటితో పళ్ళు కూడా తోముకోవచ్చు.
- బిల్వపత్రం(మారేడు) : శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు ఆకు..నీటిని శుద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులను తగ్గిస్తుంది. శరీర దుర్వాసనను తగ్గిస్తుంది.
- దూర్వాయుగ్మము(గరిక) : ఇది గడ్డి జాతికి చెందిన మొక్క కాబట్టి, ప్రతి పొలంలో కనిపిస్తుంది. ఇది దేహంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అధిక రక్తస్రావాన్ని, రక్తహీనతను తగ్గిస్తుంది. గాయాలు, చర్మవ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు మరియు మొలల నివారణలో దోహదపడుతుంది.
- దత్తూర పత్రం(ఉమ్మెత్త) : వంకాయ జాతికి చెందినది ఈ ఉమ్మెత్త. ఊపిరితిత్తులను వ్యాకోచింపచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది. శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణలో బాగా పని చేస్తుంది. ఇందులో విషం తాలూకు గుణాలు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
- బదరీ పత్రం(రేగు) : ఈ పత్రం గ్రామాల్లో ఎక్కడైనా కనిపించే, అందరికి తెలిసిన మొక్క. వీటి నుండి లభించే రేగు పళ్ళు కూడా చాలా బాగుంటాయి. ఇది చర్మవ్యాధులకు మంచి విరుగుడు మరియు జీర్ణకోశవ్యాధులు, రక్తసంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు పని చేస్తుంది. మరియు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- అపామార్గ పత్రం(ఉత్తరేణి) : ఈ ఉత్తరేణి మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలును కలుగజేస్తుంది. ఈ ఆకులు గుండ్రంగా ఉండి, గింజలు, ముళ్ల ను కలిగి ఉంటాయి. దీనిని దంత దావనానికి వాడుతారు. పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలకు వాడుతుంటారు.
- తులసి(తులసి) : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మొక్క ఇది. శరీరంలో ఉష్ణాన్ని నియంత్రిస్తుంది. అందుకే, ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి దగ్గు, జలుబు వంటివి దరి చేరవు. మరియు జ్వరం, చుండ్రు, అతిసారం, చెవిపోటు తగ్గేందుకు తులసి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- చూతపత్రం(మామిడాకు) : ఈ మామిడి తోరణాలను హిందువుల పండగల సమయంలో, శుభకార్యాల సమయంలో తప్పనిసరిగా ఉపయోగించాల్సిన ఆచారం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే, ఈ మామిడి తోరణాల వల్ల ఇంటిలోనికి క్రిమి కీటకాలు చేరకుండా కాపాడుతుంది. అయితే, ఈ మామిడి ఆకులు రక్త విరోచనాలు, చర్మ వ్యాధులకు పని చేస్తుంది.
- కరవీర పత్రం(గన్నేరు) : ఇది గన్నేరు మొక్క. వీటికి..”తెలుపు, ఎరుపు, పసుపు” రంగు పూలు పూస్తాయి. తేలుతో పాటు ఇతర విష కీటకాల కాటు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఈ ఆకులను ఉపయోగిస్తారు.
- విష్ణుక్రాంత పత్రం(విష్ణు కాంత) : ఈ మొక్కకు నీలం రంగులో పూలు పూస్తాయి. విష్ణు క్రాంత మొక్కల ఆకులతో జ్వరం, కఫము, దగ్గు, ఉబ్బసం తగ్గుతుంది మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
- దాడిమీ పత్రం(దానిమ్మ) : దానిమ్మ ఆకులనే “దాడిమీ పత్రం” అంటారు. ఇది విరేచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, కండ్ల కలకలు, గొంతు నొప్పి, ముక్కు నుండి రక్తం కారడం వంటి సమస్యలను తగ్గించగలదు. మరియు చర్మ వ్యాధులు తగ్గించడానికి సహాయపడుతుంది.
- దేవదారు పత్రం (దేవదారు) : ఇది దేవుళ్ళకు ఎంతో ఇష్టమైన చెట్టు. చాలా ఎత్తుగా పెరుగుతాయి. అజీర్తి, ఉదర సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులను తగ్గించడానికి దేవదారు ఆకులు ఎంతగానో దోహదపడుతాయి.
- మరువక పత్రం(మరువం) : ఇది అందరికి తేలినదే..ఎందుకంటే, మన వాడుక భాషలో “ధవనం” అని పిలుస్తారు. పూల మాలలు తయారు చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఎంతో సువాసన కలిగి ఉండే మొక్క. ఈ ఆకులతో జీర్ణశక్తి పెరుగుతుంది. జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించడానికి దీనిని వాడుతుంటారు.
- సింధూర పత్రం(వావిలి) : మన వాడుక భాషలో వావిలి అని పిలిచే ఈ ఆకును ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. జ్వరం, తలనొప్పి, చెవిపోటు, కీళ్లనొప్పులు, మూర్చ వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
- జాజి పత్రం(జాజి ఆకు) : ఇది మల్లె జాజి మొక్క. మన వాడుక భాషలో సన్నజాజులు అంటారు. ఈ మొక్క ఆకులను నోటి పూత, కామెర్లు, వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, చర్మ వ్యాదులను తగ్గించేందుకు ఎక్కువగా వాడుతారు.
- గండకీ పత్రం(దేవ కాంచనం) : దీనిని లతా దుర్వా అని కూడా పిలుస్తారు. భూమిపై తీగ మాదిరిగా పాకుతుంది. దీని ఆకులను ఆహారంగా కూడా స్వీకరిస్తారు. మూర్ఛ వ్యాధి, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పురుగుల నివారణకు చక్కగా పని చేస్తుంది. అతిమూత్ర సమస్య ఉన్నవారు ఈ ఆకును ఉపయోగిస్తారు.
- శమీ పత్రం(జమ్మి ఆకు) : ఇది అందరికి తెలిసిన మొక్క మరియు దసరా పండగ రోజు పూజ చేసి, ఆకులను ఇచ్చి పుచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఈ జమ్మి ఆకులను కుష్ఠు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు, కఫ సమస్యల్లో ఎక్కువగా వినియోగిస్తారు.
- అశ్వస్థ పత్రం(రావి ఆకు) : ఈ రావి చెట్లను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయాల వద్ద ఎక్కువగా కన్పిస్తుంటాయి. వీటి ఆకులను మలబద్దకం, వాంతులు, జ్వరాలు, మూత్ర వ్యాధుల కోసం ఉపయోగిస్తుంటారు. వీటిని తీసుకుంటే జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.
- అర్జున పత్రం(తెల్ల మద్ది) : ఈ చెట్టు ఆకులు కూడా మర్రి ఆకులులాగే కన్పిస్తాయి. వీటిని చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల నివారణలో ఉపయోగిస్తారు.
- ఆర్క పత్రం(జిల్లేడు) : తెల్ల జిల్లేడు ను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు. ఈ జిల్లేడు చెట్లు గ్రామాల్లో ఎక్కువగా ఉండడం మనం చూస్తూనే ఉంటాము. ఈ ఆకులను చర్మ వ్యాధులు, కోరింత దగ్గు, సెగ గడ్డలు, కీళ్ల నొప్పులు, చెవి పోటు, విరేచనాలు, తిమ్మిర్లు వంటి వాటిని తగ్గించడానికి వినియోగిస్తుంటారు.
పత్రాల యొక్క ఆరోగ్య రహస్యాలు(Health secrets of documents)
ఈ పత్రాలను మన స్వహస్తాలతో త్రుంచేటపుడు కొన్ని ఆకులు “పాలు” స్రవించేవిగా ఉంటాయి. మరి కొన్ని ఆకులు “పసరు” స్రవించేవిగా ఉంటాయి. వీటి నుండి స్రవించే పాలు, పసర్లు కొంచెమైనా మన చర్మ రంధ్రాల గుండా శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధి చేసి, నరాలకు పుష్టిని కలిగిస్తాయి.
ఇది ఒక ఆరోగ్య కారణంకు సూచన. ఎలాగంటే, ఈ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర, మొక్కల దగ్గర గడుపుతూ..అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం. మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్నా ఔషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు. కనుక, ఊపిరితిత్తులు శుద్ధిపడి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుండి విముక్తి పొందుతాము.
ఇది ఒక భౌతిక కారణంగా కూడా చూపుతారు. ఎలాఅంటే, ఏనుగు వన సంచారి..ఆకులు, అలములు దాని ఆహరం. కాబట్టి, గజముఖుడైన వినాయకుడిని ఆకులతోనే అర్చించాలి. అంతేకాకుండా, అవసరమైన, లేకపోయినా..ఏనుగు..తన తొండాన్ని ఖాళీగా ఉంచకుండా ఏ తీగనో, కొమ్మనో లాగుతూ ఉంటుంది.
అలాగే, ఇది ఆధ్యాత్మికతకు కూడా కారణం అవుతుంది. గజముఖుడైన వినాయకుడు మన యొక్క “మనో వణసంచారి”గా భావిస్తారు. ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మష భావాలనే కలుపు మొక్కలను సమూలంగా పీకేసి..తన మోదక ప్రసాదాలతో మన బుద్దిని పవిత్రం చేసి, ఆనందమయ మార్గంలో మనల్ని నడుపుతారు.
ఇందుకు కృతజ్ఞతగా వినాయకునికి ఇష్టమైన పత్రాలతో పూజిస్తూ ఉంటాము.
ముగింపు(Conclusion)
గణేశుడి పూజ, ఉత్సవం అంటే ఒక పండుగ, వేడుకగా జరుపుకుంటాము మరియు ఎంతో అనుగ్రహాన్ని, ఆనందాన్ని పొందుతాము అని మనందరికీ తెలుసు. ఇందులో గణేశుడి పూజలో ఉపయోగించే 21 రకాల ఆకులు ఎంతటి ఔషధాన్ని కలిగి ఉండి..మనకు ఎంతటి ఆరోగ్యాన్ని అందివ్వగలుగుతున్నాయి అనేది వివరంగా తెలుసుకున్నాము.
ముఖ్యమైన విషయం ఏమిటి అంటే..గణేష్ పండుగ అనగానే, ఆనందం కోసం మాత్రమే ఉత్సవం జరుపుకునే వేడుక అని అర్ధం ఒక్కటే కాదు అని గుర్తించాలి. గణేష్ పూజ కోసం ఉపయోగించే ఆకులు, పూజ విధానం అనేది మానవాళి మనుగడకు, సమాజానికి, ప్రకృతికి ఎంతో మేలు కలిగించేందుకే..సరిఅయిన పద్దతిలో ఆచారాలను మన పూర్వీకులు, ఋషులు కనిపెట్టి ఉన్నారు. ఆ ఆచారాలను కేవలం మనం ఆచరిస్తూ ఉండడమే మన ధర్మం అవుతుంది. ఇందులోనే అసలైన అర్ధం దాగి ఉంది అని చెప్పవచ్చు.
వినాయకుడి పూజ చేస్తున్నపుడు..అక్కడ ఉపయోగించే ఆకులు, ఔషధంను కలిగిన మొక్కలు కావడం వలన..వాటి నుండి లభించే గాలి మన శరీరానికి తగిలితే చాలు..మనలోని కల్మషాలు తొలగింప చేసి, ఒక పవిత్రమైన బుద్ది, మంచి ఆలోచనలు మనలో కలిగేంతటి శక్తిని మనకు అందజేస్తుంది. అందుకే, గణేష్ ఉత్సవాన్ని కేవలం ఒక పండుగలా మాత్రమే కాకుండా, ఒక ఆచారంగా భావించడమే కాకుండా..ఎంతటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయో..ఎంతటి ఆరోగ్య స్థితి, ఆనందం మనం పూజ ద్వారా పొందగలం అనేది అవగాహనను పెంచుకొని..ఆ పూజలో పాల్గొని భక్తిశ్రద్దలతో ఉత్సవాన్ని జరుపుకోవడం వలన అసలైన గొప్ప అనుగ్రహాన్ని పొందే స్థితిని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతాము.
ఈ ఆర్టికల్ లో మేము తెలియజేస్తుంది..కేవలం, గణనాధుడిని అర్చించే 21 పత్రాలు ఏ విధమైన ఔషధాన్ని కలిగి ఉన్నాయి వాటి వల్ల మానవాళికి, ప్రకృతికి అందుతున్న లాభాలు ఏ రూపంలో ఉన్నాయి అనేది వివరిస్తున్నాము. అయితే, స్వామి వారికి ఉపయోగించే ఆకులు కేవలం పూజ సమయంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఒక్కో ఆకు వివిధ రకాల పూజల కోసం వాడటం చూస్తూనే ఉంటాము. వాటి నుండి వీచే గాలి చాలు మనం ఆరోగ్యవంతులం అవడానికి అని చెప్పొచ్చు.
అయితే, పైన తెలిపినట్లు..ప్రతి ఆకు ఏ రకమైన అనారోగ్యాన్ని నివారిస్తుంది అని తెలియజేసి ఉన్నాము. అంతే కానీ, ఆకుల రూపంలో లభ్యమయ్యే ఔషధం..ను ఉపయోగించాలి అంటే..కేవలం అనుభవజ్ఞుల సూచనలు, సలహాలతో మాత్రమే పాటించాలి. ఎవరికీ వారు సొంతంగా ఆకులను ఉపయోగించి ఆయా రోగ నివారణ చేసుకుంటాము అంటే..అది సాధ్యం కాదు అనే చెప్తాము. ఎపుడు సాధ్యం అవ్వగలదు అంటే..ప్రతి ఆకును ఎలా ఉపయోగించాలి అనే పూర్తీ అవగాహనను కలిగి ఉండాలి. మరియు ఏ అనారోగ్యానికి ఎంత మోతాదు వారి శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలి అనేది పూర్తీ సమాచారం తెలిసి ఉండాలి..ఈ విధంగా మనం..ప్రకృతి అందించే ఎన్నో రకాల లాభాలను పొందుతూ ఆరోగ్యకరమైన జీవనాన్ని అనుభవిద్దాము.