మనం ప్రతిరోజూ తాగే “పాలు” అందించే ఉపయోగాలు(Benefits of the milk we drink every day)
సాధారణంగా, మనిషి పుట్టినపుడు నుండి..మొదటగా తల్లి పాలను సేవిస్తూ..వారి జీవనం మొదలౌతుంది. తర్వాత వారు ఎదుగుతున్న సమయంలో గేదె పాలు లేదా ఆవు పాలు త్రాగుతూ పెరగడం జరుగుతుంది. ఇది సమాజంలోనే ఒక “సాంప్రదాయం, ఆచారం”గా అనే పదాలతో వివరించేంత అలవాటుగా మారింది. పాలు త్రాగనిదే వారి శరీరం ఎదుగుదల ఉండదు..కన్పించదు అంటారు. ఎందుకంటే..అప్పుడే పుట్టిన పసిపాప నుండి మొదలు చిన్నపిల్లలుగా ఎదిగే వయస్సు వరకు కేవలం, పాలు మాత్రమే వారి యొక్క బలవర్ధకమైన ఆహరం అవుతుంది.
కాబట్టి, పాలు అనే పదార్థం..ప్రతి రోజు ఉదయం లేచిన మొదలు ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. పాలతో తయారుచేసిన టీ మరియు కాఫీ రూపంలోనూ లేదా నేరుగా పాలను తాగే అలవాటు..చిన్న, పెద్ద వయస్సు అనే తేడా లేకుండా అందరికి ఉంటుంది. ఇది ఒక సహజమైన అలవాటు నుండి మర్చిపోలేని అలవాటుగా ప్రపంచం అంతా పాల ఉత్పత్తులపైన ఆధారపడి ఉంటున్నాము ఈ క్షణం వరకు కూడా..
దీనికి కారణం, పాలు అన్ని రకాల పోషక విలువలను కలిగి ఉన్న ఒక “శ్రేష్ఠమైన బలవర్దకపు ఆహరం(The best fortifying food)”. కాబట్టి, పాలను “సంపూర్ణ పోషక ఆహారం(A complete nutritional diet)”గా పరిగణిస్తారు. మరియు సమతుల్యమైన ఆహరం యొక్క అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా తీసుకోగలిగే ఉత్తమ ఆహార పదార్థం. కాబట్టి, పాలు మన శరీరానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఇది కండరాల మరియు ఎముక ఆరోగ్యాన్ని నిర్మించడానికి అవసరమైన “ప్రోటీన్లను” మరియు “క్యాల్షియం”లను అత్యంత సమృద్ధిగా కలిగిన వనరులలో ఒకటిగా ప్రాముఖ్యతను కలిగి ఉంది అని చెప్పవచ్చు. అలాగే, ఇది మన ప్రేగుల్లోని ఆరోగ్యానికి సహాయపడే సూక్ష్మజీవుల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అందుకే, ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సిఫారస్ చేస్తూ ఉంటారు. అయితే, ఇందులో “విటమిన్ సి, ఇనుము” కొద్దిగా తక్కువగా ఉంటుంది.
పాలు మరియు పాలఉత్పత్తులు ప్రోటీన్ యొక్క మంచి వనరులు. సాధారణంగా ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి అదేవిధంగా బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే, పాలల్లోని పోషకాలు కడుపును నిండుగా ఉంచుతూ..ఎక్కువ సమయం ఆకలిగా అనిపించనివ్వదు. బరువు తగ్గాలనుకునే వారు “టోన్ లేదా స్కీమ్డ్” పాలు తాగాలి. పాలు తీసుకోవడంతో పాటుగా తగిన వ్యాయామం కూడా అవసరం అని గ్రహించాలి. మరీ ముఖ్యంగా, పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం అవుతుంది. ఇందుకుగాను..ఆవుపాలు పిల్లలకు ఎంతో శ్రేష్టమైనవి.
పాల ఉత్పత్తులు(Dairy products)
- పాలను ఉపయోగించి మనం ప్రతిరోజు టీ, కాఫీ లు తాగుతుంటాము.
- పాలను తోడుపెట్టినపుడు పెరుగు తయారవుతుంది.
- మరిగించిన పాల మీద మరియు తోడుపెట్టిన పెరుగు మీద “మీగడ” తయారవుతుంది.
- పెరుగును పలుచగా చేసి, నీటిని జత చేస్తే, మజ్జిగ, లస్సీ తయారౌతుంది.
- మజ్జిగను బాగా చిలికితే వెన్న తయారౌతుంది.
- వెన్నను మరగపెట్టినపుడు నెయ్యి తయారౌతుంది.
పాలల్లో ఉండే పోషక విలువలు(Nutritional values of milk)
పాల ద్వారా మన శరీరానికి క్యాల్షియం, ప్రోటీన్లు, సహజ కొవ్వు, కేలరీలు, విటమిన్ డి, విటమిన్ బి2, పొటాషియం, భాస్వరం వంటి వాటి యొక్క సహజ మూలం “పాలు”. ఇది విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి6, నియాసిన్, ఫోలేట్, మెగ్నీషియం, జింక్ లతో కలిపి వివిధ పోషకాలను కలిగి ఉంటుంది.
100మి.లీటర్ల పాలలోని పోషక పదార్థాలు..
పోషక పదార్థం(Nutrient) :
- శక్తి – 62కిలోకేలరీలు
- ప్రోటీన్లు – 3.33గ్రా
- కొవ్వులు – 4 గ్రా
- పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్స్) – 5గ్రా
- చక్కరలు – 5గ్రా
ఖనిజాలు(Minerals) :
- క్యాల్షియం – 125 మి.గ్రా
- పొటాషియం – 133 మి.గ్రా
- సోడియం – 44 మి.గ్రా
కొవ్వులు /కొవ్వు ఆమ్లాలు(Fats/Fatty Acids) :
- సాచ్యురేటెడ్ – 1.88 గ్రా
- అసంతృప్త – 0.83గ్రా
- కొలెస్ట్రాల్ – 10 మి.గ్రా
పచ్చి పాల యొక్క లాభాలు, నష్టాలు(Pros and Cons of Raw Milk)
సాధారణంగా, మన పెద్ద వారు చెప్తూ ఉంటారు. పచ్చిపాలు తీసుకునే వాళ్ళం..అదే ఇప్పటి వరకు మా శరీరానికి బలాన్ని అందిస్తుంది అనే ఒక నమ్మకంతో చెప్తూ ఉండడం చూస్తాము..ఇప్పటికి గ్రామాల్లోని కొంతమంది ప్రజలు మరియు ఎవరికైనా పచ్చిపాలు తాగాలనే ఇష్టం కలిగి ఉన్నవారు కూడా ఇలా..చెప్తూ ఉంటారు. పచ్చిపాలు తాగడం అంటే ఇష్టం అని. అది వారికి లాభాన్ని చేకురుస్తుందా? నష్టాన్ని చేకురుస్తుందా? అవసరమైన విషయం కాదు. కేవలం, పచ్చిపాలను తాగడం ఒక ఇష్టంతో కూడిన అలవాటుగా మారడం జరుగుతుంది సహజంగానే. అయితే, ఈ పచ్చిపాలు తాగడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు గురించి కూడా తెలుసుకుందాము.
లాభాలు :
- అయితే, ఈ పచ్చిపాలు తాగడం వలన మన శరీరానికి పూర్తీ పోషకాలు అందుతాయి.
- నిజానికి పాలను మరిగించినపుడు దానిలోని ముఖ్యమైన పోషకాలు నాశనం అవుతాయి అని చెపుతారు. అందువల్ల, పచ్చిపాలు తాగడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
- పచ్చిపాలలోని కొవ్వు ఆమ్లాలు శరీరానికి పుష్కలంగా అందేలా చేస్తుంది.
- మరియు అలెర్జీల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.
- ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
- చర్మానికి ఎంతో మేలును కలిగిస్తుంది.
- ఎగ్జిమా తో బాధపడే వారు పచ్చిపాలను తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అని ఈ విధంగా పరిశోధనల్లో నిరూపణ జరిగింది.
నష్టాలు :
- పచ్చిపాలు తాగడం వల్ల శరీరానికి ఎంత బలాన్ని, శక్తిని అందించి మేలును చేస్తున్నాయో..అదే విధంగా, కొంత హానిని కూడా కలగజేసే ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు.
- అది ఎలా అంటే..పచ్చిపాలలో హానికరమైన బాక్టీరియా అనేది గేదె నుండి లేదా ఆవు నుండి పాలను తీసుకునేప్పుడు వచ్చి చేరడం జరుగుతుంది. మరియు గేదె లేదా ఆవులు తినే ఆహారపదార్థాల స్వచ్ఛతపైనా కూడా ఆధారపడి ఉంటుంది.
- అలా..పచ్చిపాలలో ఉండే బాక్టీరియా.. మన శరీరంలో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఏర్పరుస్తుంది. మరియు
- విరేచనాలు, కీళ్లనొప్పులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కలిగిస్తుంది అని ఆరోగ్యనిపుణులు చెపుతున్నారు.
- ఇంకా గుండెపోటు, పక్షవాతం కు కారణం కూడా కావొచ్చు.
- అలాగే, గర్భధారణ సమయంలో పచ్చిపాలు తాగడం మానుకోవడం సరైంది అవుతుంది.
పాల నుండి లభించే ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits of Milk)
- ప్రోటీన్ వనరు(Protein source) : పాలు ఒక సంపూర్ణ మాంసకృత్తుల ఆహరం. కాబట్టి, మన శరీరం సరియైన పద్దతిలో పనిచేయడానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలను పాలు కలిగి ఉండడం వల్ల, పాలు తీసుకోవడం అనేది ఎంతో మేలును కలిగించే విషయం అవుతుంది.
- రీహైడ్రేషన్(Rehydration) : ద్రవ పదార్థాలను మన శరీరానికి తరచుగా అందించడం అనేది ఎంతో ముఖ్యమైన ప్రాథమిక భాగం. కాబట్టి, వ్యాయామం తర్వాత కానీ, శరీరానికి అతి శ్రమ కలిగినపుడు గానీ..పళ్ళ రసాలు మరియు పానీయాలు తాగడం కంటే కూడా పాలు తాగడం అనేది చాల ఉత్తమమైనది అని చెప్పవచ్చు.
- నిరాశ, కుంగుబాటు(Depression) : విటమిన్ డి అనేది ఎముకలను, దంతాలను దృడంగా ఉంచడంతో పాటు మెదడుకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అయితే, పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉండడం వల్ల మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను చూసుకోవడంలో విటమిన్ డి సహాయపడుతుంది. ఈ సెరోటోనిన్ అనేది మానసిక స్థితి, ఆకలి మరియు నిద్రతో సంబంధం ఉన్న హార్మోన్. కాబట్టి, “తక్కువ కొవ్వు” కలిగిన పాలు తాగడం వల్ల సమర్థవంతంగా కుంగుబాటు లక్షణాలను తగ్గిస్తుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరియు ఈ పాలు జ్ఞాపకశక్తిని, జ్ఞానాన్ని కూడా మెరుగుపరచగలదు.
- బరువు తగ్గడం(Weight loss) : పాలలోని అనేక రకాల పోషక పదార్థాల కారణంగా బరువు తగ్గడానికి మరియు బరువు పెరగకుండా ఆపడానికి సహాయపడుతుంది. ఎందుకంటే, పాలలోని అధిక ప్రోటీన్ పరిమాణం వల్ల..పాలు తాగినప్పుడు వారి పొట్ట నిండిన అనుభూతిని ఎక్కువ సమయంపాటు చెందుతారు. దీనితో ఏదైనా ఆహారాన్ని అతిగా కానీ..లేదా ఎక్కువ సార్లు తినడం అనేది ఇష్టం తగ్గిపోయి..శరీర బరువు తగ్గడానికి గానీ, పెరగడానికి గాని అవకాశం ఉండదు.
- ఎముకల ఆరోగ్యం(Bone health) : పాలు తాగడం వల్ల ముఖ్యంగా మన శరీర ఎముకలకు ఆరోగ్యకరమైన పటిష్టతను, దృఢత్వాన్ని అందజేస్తుంది. ప్రధానంగా ఇది పాలలో ఉండే పాస్ఫరస్, పొటాషియం మరియు విటమిన్ కె2 వంటి వివిధ పోషకాల వల్ల లభిస్తుంది. పాలు అనేవి క్యాల్షియం, విటమిన్ డి యొక్క గొప్ప మూలం. కాబట్టి, ఇది ఎముక ఆరోగ్యానికి ప్రధానంగా సహాయపడుతుంది. అలాగే, “బోలు ఎముకల వ్యాధి” ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా పాల వినియోగం సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- కండరాల నిర్మాణం(Muscle building) : అధిక నాణ్యత కలిగిన గొప్ప ప్రోటీన్లను పాలు మన శరీరానికి అందిస్తున్నాయి. అవసరమయ్యేంతటి అమైనో ఆమ్లా శ్రేణి ని కలిగిన పాలు శరీర కండర నిర్మాణానికి ఒక పరిపూర్ణ అనుబంధక ఆహరం అని అంటారు. పాలు, పాల ఉత్పత్తి వినియోగం వయసు సంబంధిత కండరాల క్షీణత మరియు వాపును తగ్గిస్తుందంట. ఇంకా, కండర నిర్మాణం కోసం చేసే వ్యాయామం తర్వాత పాలసేవనం అనేది ఒక అద్భుతమైన శక్తిని అందిస్తుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- దంత సంరక్షణ(Dental care) : పాలను సేవించడం అనేది పాలలోని క్యాల్షియం దంతాలలో నిల్వ ఉంచుతూ..ఎంతో సంరక్షణకారిగా మరియు దంత ఆరోగ్యాన్ని అందించగలదు. ఎందుకంటే, దంతాల మీద ఎనామిల్ ఉపరితల ఆమ్ల పదార్దాల చేత దెబ్బతినకుండా పాలసేవనం అనేది రక్షిస్తుంది. అలాగే, దంతక్షయం ప్రమాదాన్ని తగ్గించే బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. అయితే, బాక్టీరియా అనేది దంతాల ఉపరితలంపై వరకు రాకుండా పాలలోని ప్రోటీన్లు నిరోధిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
- రక్తపోటు యొక్క అదుపు(Control of blood pressure) : ఆవుపాలు అనేవి మనకు పొటాషియం ను అందిస్తుంది. ఇది ధమనుల యొక్క వ్యాకోచాన్ని పెంచుతుంది. తద్వారా రక్తపోటును తగ్గించగలుగుతుంది.
- కీళ్ల వాపు(Joint inflammation) : ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారు ఈ కీళ్ల వాపు, నొప్పిని అనుభవిస్తుండడం జరుగుతుంది. అయితే, ఇది కీళ్లలో మృదులాస్థి యొక్క అధోకరణస్థానభ్రంశం జరిగి కీళ్లలో వాపు సంభవిస్తుంది. కాబట్టి, వివిధ రకాల పోషకాలు కలిగి ఉన్న పాలను తీసుకోవడం ఈ కీళ్ల వాపును పెరుగుదలను నిరోధిస్తుంది.
వేడి పాలు ఎందుకు తాగాలి? మరియు ప్రయోజనాలు(Why drink hot milk? and benefits)
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలను చల్లగా కాకుండా వేడిగా తీసుకుంటే, దాని పోషక విలువలు గణనీయంగా పెరుగుతాయి. మరియు వేడి పాలు త్వరగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే..ఇందులో “లాక్టియం” అనే ప్రోటీన్ ఉంటుంది.
- ఇది “బీపీ“ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- అదే సమయంలో చల్లని వాతావరణం ఉండే రోజుల్లో వేడి పాలు తాగడం ద్వారా మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు.
- ఇది శరీరాన్ని తేమ నుండి రక్షిస్తుంది.
- గోరువెచ్చని పాలల్లో తేనె కలిపి తాగితే..యాంటీ బాక్టీరియల్ గా కూడా పని చేస్తుంది.
- ఇది జలుబు, దగ్గు నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
- వేడి పాలు తాగడం వలన పాలల్లో ఉండే (మన ఆరోగ్యానికి హాని కలిగించే) బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మరియు శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ ప్రక్రియను “పాశ్చరైజేషన్(Pasteurization)” అంటారు.
- ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగడం వలన మీ కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. తద్వారా ఏ ఆహారపదార్థాలను మళ్ళీ మళ్ళీ తినకుండా ఉంటారు. ఇలా..తక్కువ ఆహరంతో మీ బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమై, మీరు మరింత ఫిట్ గా ఉండగలరు.
- రాత్రి సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగడం వలన..మీ శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని కలిగిస్తూ..నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
- ఎందుకంటే, ఇందులో “ట్రిప్టోఫాన్(tryptophan)” అనే అమైనో యాసిడ్ మంచి నిద్రకు సహాయపడుతుంది. దీని వల్ల మీలో అలసట అనేది కన్పించే అవకాశం ఉండదు.
- పాలల్లో ఉండే కాల్షియం మీ ఎముకలను బలపరుస్తుంది. వేడి పాలు తాగడం వలన శరీరంలోని ఎముకల సాంద్రత పెరుగుతుంది. మరియు బలంగా తయారు అవుతాయి.
- అలాగే, రక్తంలో “చక్కర స్థాయి” అదుపులో ఉంటుంది. “డయాబెటిస్(Diabetes)” రోగులకు ఇది అవసరం అవుతుంది.
పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు(Side Effects of Milk)
- పాలు మరియు ఇతర రకాల ఆహారపదార్దాల నుండి శరీరంలోకి చేరే “అతిని మించిన” క్యాల్షియం అనేది కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
- “లాక్టోస్” అనేది పాలలో ఉండే సహజమైన చక్కర. చాలా మంది లాక్టోస్ అంటే అసహనానికి గురి అవుతుంటారు.
- ఆవుపాలలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉండడం వల్ల, హృదయ ఆరోగ్యానికి హానికరంగా భావిస్తారు.
- పాలలో ఉండే పాల విరుగుడు ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు మన ముఖంపైన మొటిమల ఉత్పన్నానికి మరియు చర్మ సంబంధ రుగ్మతలకు కారణం అవుతుంది అని సూచించబడింది.
ముగింపు(Conclusion)
మన జీవనం పాలతోనే మొదలవుతుంది అనే విషయం అందరికి తెలిసిందే..అయితే, ఇందులో పాల వివరణ మరియు పాలలో ఉండే పోషకాలు, మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి వివరంగా తెలుసుకున్నాము..
మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే..సాధారణంగా, ప్రతి ఒక్కరు పాలు తాగడం లేదా టీ, కాఫీ రూపంలో తాగడం అలవాటు ఉంటుంది. ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలి. కానీ, పాలు తాగడం వల్లే ఎదుగుదల ఉంటుంది అంటారు. అవే పాలు మన శరీరానికి మోతాదు అధికం అయితే, కలిగే నష్టాలు అనారోగ్యం రూపంలో అనుభవించే పరిస్థితికి తీసుకువెళ్తుంది అని తెలుసా? మీలో ఎవరికైనా..?
కొంతమందికి ఉదయం లేదా రాత్రి పాలు తాగాలి..దీని వల్ల శక్తి వస్తుంది..అది ఒక నియమం. కాబట్టి, తాగేస్తున్నాము అని మాత్రమే వారికి తెలిసింది.. కానీ, పాలు వారి శరీరానికి ఏమైనా హాని కలిగిస్తున్నాయా అనే విషయం గురుంచి కూడా అవగాహన ఉండదు. ముందుగా, మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే..పాలు తాగుతున్నారు సరే..తాగే ప్రతిసారి..తాగిన తర్వాత మీ శరీరంలో కలిగే మార్పులపై దృష్టి ఉంచి అనుభూతి చెందండి..ఖచ్చితంగా మీకే తెలుస్తుంది మీలో భావన ప్రశాంతంగా ఉందా? లేదా అజీర్ణంగా అనిపిస్తుందా? అని, ఇలాగ, కొన్ని సార్లు తాగిన తర్వాత గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అప్పుడు, పాలు మీ శరీరానికి సంపూర్ణమైన ప్రశాంతతను కలిగిస్తుంది అనుకుంటే..తప్పనిసరిగా రోజుకు ఒక గ్లాస్ పాలు తాగవచ్చు. పాలతో మీ ఆరోగ్యానికి ఎలాంటి నష్టం అనిపించట్లేదు అనిపించి..రోజుకు మీ ఇష్టం వచ్చినట్లు సమయపాలన లేకుండా ఎన్ని గ్లాసుల పాలు అయినా తాగుతాము అంటే మాత్రం, అది కాస్త..ఏదైనా అనారోగ్యానికి కారణం అయ్యే అవకాశం లేకపోలేదు. కనుక, మీ ఆరోగ్యానికి మీరే భాద్యులు అవుతారు అని గుర్తుంచుకోవాలి. అనారోగ్యం కలగడం ఏంటి అని ఆలోచిస్తే..పాలలోని పోషకాలు, మీ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి..మీరు తీసుకునే మోతాదు దానికి సరిపడితేనే బాగుంటుంది. లేదంటే, ఏది ఎక్కువైనా, తక్కువైనా విషమ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని అర్ధం.
మన శరీరం ఎదుగుతున్నా కొద్దీ..కలిగే మార్పులు ఆహరం రూపంలో కావొచ్చు లేదా జీవన విధానంలో కలిగే పరిస్థితులను బట్టి కావొచ్చు..పాలు తాగడం అనేది అలవాటుగా ఉండి..అకస్మాత్ గా కూడా ఎవరికైనా ఇష్టం తగ్గిపోవొచ్చు..ఎందుకంటే..వారికి పాలు తాగితే అజీర్ణంగా, అసహనంగా అనిపిస్తున్న భావన కలుగుతుంది. ఇలా..తాగిన ప్రతి సారి అనిపిస్తే కనుక..వెంటనే మానుకోండి. ఇలాంటి సమయంలో వారు పాలు తాగకపోవడం సరైందే అవుతుంది. దీనివల్ల మన శరీరానికి వచ్చే నష్టం ఏమి ఉండదు.
ఎలా అంటే, ప్రపంచంలోని అనేక మందికి పాలు మన శరీరానికి క్యాల్షియం ను అందించే అత్యంత సమర్ధవంతమైన ఆహారం అంటారు. కానీ, కాదు అనే చెప్పాలి. పాలు ఎముక ఆరోగ్యానికి ఎంతో కీలకం అని చెప్తున్నప్పటికీ, పాలు అలెర్జీలు, అనారోగ్యం మరియు జబ్బుల్ని కూడా కల్గిస్తుంది. దీనికి కారణం, అధిక మోతాదులో పాలను సేవించడం కూడా అవుతుంది. లేదా మన ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా పాలు మన శరీరానికి సరిపడకపోవడం జరుగుతుంది.
అయితే పెద్ద వారు గాని, వైద్యుడు గాని పాలు తాగమని సలహా కూడా ఇస్తూ ఉంటారు. కానీ, ఇందులో ప్రతి ఒక్కరికి..చల్లని పాలు తాగడమా? లేదా వేడి పాలు తాగడమా?, ఉదయం మాత్రమే తాగడమా? లేదా రాత్రి పడుకునే ముందు తాగడమా? అనే సందేహాలు కూడా కలగవచ్చు. కేవలం, ఒక పొంగు వచ్చే వరకు పాలను వేడి చేయడం సాధారణం. వేడి అంటే, గోరువెచ్చగా అని అర్ధం..గోరువెచ్చగా ఉన్నపుడు మాత్రమే మనం తాగగలం అని తెలుసు కదా! ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నపుడు కానీ, పూర్తిగా చల్లబడిన తర్వాత కానీ..తాగడం వలన ఎలాంటి నష్టం ఉండదు.
కాకపొతే, కొందరికి చల్లని పాలు తాగడం ఇష్టం ఉండదు. అయితే, చల్లని పాలు అంటే అర్ధం..ఒకసారి వేడి చేసి చల్లార్చిన పాలు అయి ఉండాలి. దీని వల్ల పాలలోని హానికరమైన బాక్టీరియా నశిస్తుంది. తర్వాత ఉదయం లేదా రాత్రి అనే సమయాల గురించి ఆలోచిస్తే..మీ అనుకూల పరిస్థితిని బట్టి తీసుకోవచ్చు.. అంతేకాని, ఎలాంటి నియమాలు ఎవరు కూడా విధించి ఉండరు. దీని బట్టి, పాలను ఏ విధంగా, ఏ సమయంలో తీసుకోవడం అనేది ముఖ్యం కాదు..కేవలం మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని..మీ మనస్సుకు, మీ నోటికి కలిగే రుచి ఆధారంగానే ఒక సరైన మోతాదులో ఒక అవగాహనతో మీరు “పాలు” తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యల గురుంచి భయపడాల్సిన అవసరం ఉండదు.